చలం ప్రేమలేఖలు

 "ఈ ప్రపంచం ఈ సృష్టి సౌందర్యమయం ఒక ప్రేమ లేఖ."


మనసున్న వారికి వారి మనసెరిగిన వారికి ఎంతో మనోహరంగా స్పృశిస్తూ0ది ఈ వాక్యం.


ఎంత లోతైన నిర్వచనం......


 అసలు మనసు పొరలలో ని అతి సున్నితత్వ భావాన్ని తట్టిలేపి దాని చేత తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పించ గలగడం ఎవరికీ అంత సులువు కాదు. జీవితంలో చాలామంది పొందలేకపోయిన మానసిక ప్రశాంతతను కలిగి స్తూ, మనో మందిరాన్ని వెలిగించి మానస వీణ ను మ్రోగించిన ప్రేమ అనుభూతిని గుర్తు చేస్తాయి చలం " ప్రేమ లేఖలు".


తెలుగు వారి జీవితంలో ఉత్తరాలు రాసుకునే సంప్రదాయం అంతర్భాగమై ఉంది.


మనసులో ముద్రించుకున్న మనిషి కోసం ఏ విధంగా ఎదురుచూస్తామో ఆ మనిషి రాసే ఉత్తరాల కోసం కూడా అలాగే ఎదురు చూడటం ఓ చిత్రమైన మధురమైన అనుభూతి.

సోషల్ మీడియా హవా నడుస్తూ, mails,  మెసేజెస్, తలచుకోగానే మాట్లాడుకునే అవకాశం ఇచ్చే స్మార్ట్ ఫోన్లు ఉండడంవల్ల ఈరోజుల్లో ఉత్తరాలు రాసుకునే అలవాటు అవసరం కనుమరుగైపోయింది.


కానీ నీ మనుషులు మాటలు గాలిలో కలిసి పోతాయి.  వాళ్ళు రాసిన మాటలు మాత్రం నాలుగు కాలాలు నిలిచిపోతాయి. రానురాను మధురానుభూతులతో వెలిగి పోతాయి. మనసుల భావోద్వేగాల తాలూకు స్మృతులు గా మిగిలిపోతాయి.


సాహిత్యంలో ఒక ప్రక్రియగా లేఖారచన విశిష్ట ప్రాచుర్యం పొందింది.  మనసులోని మమత నంతా రంగరించి మధుర మధుర వచనాలతో పొంగ రించిన చలం ప్రేమలేఖలు ఎలా ప్రసాద్ రసోద్వే గాన్ని ప్రతిఫలించాయో , సాహిత్యాన్ని అభిమానించి, కొద్దో గొప్పో స్పందించే మనసున్న ప్రతి మనిషి ఈ "ప్రేమలేఖ ల" మాధుర్యం  ఆస్వాదించి తీరాలి.


చలం ప్రేమలేఖలు లో భావుకత కంటే నాకు  నచ్చిన తాత్వికత వేదాంత ధోరణి కి సంబంధించిన ఈ వాక్యాలు చూడండి.


"ఈ వాంఛ కి పరిపూర్ణ సాఫల్యం అనేది ఉందా ? లేక కట్టెని అగ్ని కాల్చి మసి చేసినట్లు, దాన్ని మాడ్చ డమెనా  అంతం?"


అంతేకాదు భావుకత్వం తో నిండిన ఈ వాక్యాలు చూద్దాం!!


"సాయంత్రం ఎవరో మంత్రం పెట్టినట్టు ఆకాశమంతా చప్పున మారింది.  ఆకాశ నాథుడు తన సభ అలంకారాన్ని మార్చ మన్నాడు కాబోలు, వాన, మబ్బులు క్షణాల్లో మాయమై నవ్వే చిన్న చంద్రుడు నక్షత్ర బారులు రంగం తీర్చాయి. భూమి మీద పడ్డ వాన తడి గాలి ఆశ్చర్యంతో ఆకాశాన్ని చూస్తున్నాయి . 


మరి ఆ పడమటి నక్షత్రం. ?... 

ఏడుపు మాని నవ్వే ప్రియురాలి  లాగా మెరుస్తోంది. నువ్వు ఆకాశం చూస్తున్నావా? లేక ఏదో పుస్తకంలో నిరర్ధక వాక్యాలని జ్ఞాపకానికి పట్టించుకున్నావా?"


చూసారా తెలుగు వాళ్ళకి ప్రేమించడం ప్రేమలో ఔన్నత్యాన్ని ప్రేమరాహిత్య జీవితం ఎంత వృధానో చివరికి ప్రేమ లేఖలు ఎలా రాయాలో చెప్తూ, ఈ పుస్తకం రాసి అచ్చేసి, మనసు గిచ్చేసి హృదయ మైదానంలోకి వచ్చేసి ఇలా అంటున్నాడు.


"వేయి జన్మల విరహాగ్ని మూటగట్టుకుని ఈ లోకం లోకి వచ్చాను".

అని

ఎంతో ధైర్యంగా ప్రకటించుకున్న చలం ప్రేమ కోసమే పుట్టాడో ఏమో!!!


రచయితగా చలం గొప్ప దార్శనికుడు, అంతకన్నా గొప్ప ప్రేమికుడు, ప్రేమో పాసకుడు. తెలుగు అక్షరాలు ఇంత అందం గా ఉంటాయి. తెలుగు భాషలో ఇంత సులభంగా ఇంత అందంగా ప్రేమ పరమైన వ్యక్తీకరణ సాధ్యమే అని, ఒక రొమాంటిక్ టచ్ తెలుగు సాహిత్యానికి అందించిన, యావత్ తెలుగు ప్రజలను అచ్చెరు వొందించిన రచయిత శ్రీ చలం.


అసలు చలం ప్రేమలేఖలు చదువుతుంటే మనకు చలం మీద ప్రేమ పుట్టక మానదు. నలుగురిలో ఆయన భావాలను విభేదించిన వాళ్ళు, ఏకాంతంగా వారి మనసును అర్థం చేసుకొని, వారి రచనలు ఆస్వాదించిన వాళ్ళే.


చలాన్ని అర్థం చేసుకోవడం కష్టం. మనసు తలుపులను తెరిస్తే, చలం సంచలన భానుడై, మది గూటిలో చిరు దివ్వెను వెలిగించ గలడు.


చలం రచనలు ఏవీ ఒకరిని మెప్పించే శాలువాలు కప్పించే రచనలు కావు.


వారు రమణాశ్రమం లో ఇచ్చిన చివరి రేడియో ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పినట్లు

"ఊరికే రాయాలని రాసిన పుస్తకం ఒక్కటి లేదు లేదు నన్ను చీల్చుకుని నా రక్తం నుంచి వచ్చిన సత్యాలవి.


బాధపడాలి నలగాలి జీవిత రథచక్రాల కింద.

కలం లోంచి నెత్తురు ఒలకాలంటే,  అక్షరాలా పాండిత్యమా? కాదు సంవత్సరాల మూగవేదన అంధకారంలో అన్వేషణ నా తోటి దీన జనుల రహస్య హృదయంతర విషాదం, దిక్కులేని దుర్భర ల జీర్ణ ఆవేశం ఎవరితోనూ చెప్పుకోలేని అధమ చరిత్రల గర్భశోకం" అంటారు చలం.


నా ఉద్దేశంలో చలం ఒక దమ్మున్న రచయిత. తను నమ్మింది, నడిచింది మాత్రమే రాసి ఊహా లోకపు మార్దవమైన,   సున్నితమైన భావాలను ఈ నాటి రచయితలలో కూడా కనపడేలా చేయగలిగిన సత్తా ఉన్నా రచయిత.


అయితే చలం ప్రేమలేఖలు కాలపరీక్షకు నెగ్గాయా? 

చలం ని విమర్శించిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు వేసే ప్రశ్న ఇది.


వీటన్నిటికీ సమాధానంగా చలం రాసిన మొత్తం సాహిత్యం, వారి జీవితం జవాబు గా కనిపిస్తుంది.


అందులోనే  ఈ సమాధానం ఉంది. ఎందుకంటే ఆయన స్వయంగా ఇలా confess  చేసుకున్నారు.


"హృదయం స్పందించకుండా ఒక్కమాట రాయలేదు ఏమి రాసి ఏమి రాయక ప్రజల్ని మిస్ lead చేస్తానో" అని తనను తాను ప్రశ్నించుకుంటూ రాశారు ట.


ఈ ప్రేమ కథలు చదివితే చలం ప్రేమ అనేది ఏదో టైం పాస్ వ్యవహారం కాదు అని అది ఒక అగ్ని తపస్సు అని ప్రేమ నిర్వచనాన్ని హిమాలయాలంత ఎత్తుకు చూపించారు. ప్రేమ దేహం వరకు పరిమితం కాదని అది రెండు మనసులతో రెండు హృదయాల మధ్య అనురాగం అని ప్రేమ లేక పోవడం అంటే పరాధీనత అని హెచ్చరించారు.


స్త్రీ స్వేచ్ఛ స్వతంత్ర గురించి గుండెలు బాదుకున్నారు.


ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి స్త్రీ చలం ప్రేమలేఖలు ఇలా విశ్లేషించడం ఆ కాలంలో అయితే  మహా నేరం. ఒక సాంప్రదాయ ద్రోహం. బహుశా సమాజం నన్ను వెలివేసి ఉండేది.


కానీ చలం తన రచనల ద్వారా ఎత్తి చూపిన స్త్రీ- సమాజం- దోపిడిని ఈ కాలంతో పోల్చి చూసుకుంటే ఆయన ఎంత దార్శనికు డో అర్థమవుతుంది.


స్త్రీ స్వేచ్ఛ పురుషాధిపత్య సంకెళ్ళు తెంచుకుని సమానత్వం వైపు దూసుకుపోతున్న ధోరణి చూస్తే ఈ కాలంలో చలం బతికుంటే ఎంతో సంతోషించేవారు అనిపిస్తుంది.

ఒక సంబంధం చెడిపోవడానికి కానీ బాగుపడడానికి కానీ చాలామంది రచయితలు కానీ వారి రచనలు కానీ పూర్తిగా కారణం కాదని తదనంతర పరిస్థితులు పరిణామాలు నిరూపించాయి.


ఇప్పటి వివాహ వ్యవస్థ స్త్రీ పురుష సంబంధాల లో ఆనాటి చలం రచనలలో కొన్ని పాత్రల భావాల ఛాయలు కనిపించడం యాదృచ్చికం మాత్రం కాదు.


పెళ్లి అయి సంసారం చేసుకుంటున్న గృహిణులకు పెళ్ళికాని అమాయక యువతులను స్వేచ్ఛ పేరుతో విశృంఖల దిశగా రెచ్చగొడుతున్నాడు అని చలాన్ని ఒకప్పుడు వెలివేసింది ఈ సమాజం.

కానీ కాలక్రమేణా సమాజంలో స్త్రీకి పెరుగుతున్న విలువ సమాన హక్కులు కాలంతో పోల్చి చూస్తే ఒక నాగరికమైన పరిణితిని సూచించడం లే దూ??


ఫ్యూడల్ యుగం నుంచి అణగదొక్కబడి వంటింటి కుందేలుగా  విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మనసు అనేది ఉన్న ప్రతి స్త్రీ అనుభవించిన సంఘర్షణను, పురుషాధిక్య వేధింపులను, దోపిడి సంప్రదాయాలను, వ్యతిరేకించి సమాజం కళ్లు తెరిపించాలని చలం పాటుపడ్డాడు. పాశ్చాత్య విద్య నాగరికతల ప్రభావంతో కళ్ళు తెరిచిన సమాజం స్త్రీ శక్తిని ఔన్నత్యాన్ని గుర్తించి క్రమంగా ఆమె స్వేచ్ఛను గౌరవించింది.

చరణ్ రచ్చ నా ప్రమేయం లేకుండానే అనైతిక సంబంధాలు అక్రమ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇది ఒప్పుకోడానికి మన అభిజాత్యం అంగీకరించకపోవచ్చు.ఈ రోజు మనం చూసే క్రైమ్ స్టోరీస్ లో చాలా వరకూ వ్యవస్థ చట్టం లో ఇమడలేక తన హక్కును చాటుకునే తెగింపు ప్రతి స్త్రీ పాత్రలో కనిపిస్తుంది. ఈ కోణంలోంచి చూస్తే స్త్రీ రచనలలో దార్శనికత అర్థం అవుతుంది 20వ శతాబ్దం నుంచి చలం రచనలకు స్త్రీ సమాజం నుంచి లభిస్తున్న స్పందన ఆదరణ ఇందుకు నిదర్శనం.


లైంగిక స్వేచ్ఛ శ్రీ వాదం లో ఒక వర్గం అభిప్రాయం కావచ్చు నావరకు అది వ్యక్తిగతం మనసుకు సంబంధించింది. స్త్రీ స్వేచ్ఛకు స్వతంత్రానికి సంబంధం లేదు ఇక్కడ ప్రేమలేఖ లో నేను చూసింది గొప్ప కవితాత్మక భావుకత ఒక రస స్పందన. ప్రేమించే హృదయంలో కలిగే అనిర్వచనీయమైన అనుభూతిని. శాశ్వత బంధాన్ని కోరుకునే ప్రగాఢ ప్రణయాను రాగాన్ని.  అవసరం కోసం ప్రేమ ప్రకటించి, మర్నాడు మరో ఆకర్షణలో బ్రేక్ అప్ చెప్పే లవ్ కాదు...


ఇందులో ఒక సభ్యత ఒక సంస్కారం ఉన్నాయి.


ఏమంటారు

Comments

Popular posts from this blog

నా అంతరంగం

మౌన వీణా గానం